|
|
by Suryaa Desk | Mon, Nov 10, 2025, 03:53 PM
బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని, దాని వ్యాలిడిటీ పీరియడ్ అయిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయ విమర్శల కోసం ఈ మాటలు చెప్పడం లేదని, ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎలా కనుమరుగైందో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అలాగే మారుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌తోనే ఆ పార్టీ ప్రస్థానం ముగిసిపోతుందని అన్నారు. కేసీఆర్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని, ఆ బాధతోనే ఆయన ఇంటి నుంచి బయటకు రావడం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ ఇప్పటివరకు ప్రజలను కోరకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. "ఆరోగ్య సమస్యల వల్ల ఆయన ప్రచారానికి రాలేకపోవచ్చు. కానీ, కనీసం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఒక ప్రకటన కూడా ఇవ్వడం లేదు. దీన్నిబట్టి కేటీఆర్, హరీశ్‌రావుపై ఆయనకు ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు" అని వ్యాఖ్యానించారు.