|
|
by Suryaa Desk | Mon, Nov 10, 2025, 03:56 PM
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల ఆశ, భయాన్ని ఆసరాగా చేసుకుని జరుపుతున్న మోసాల కారణంగా నగరవాసులు సగటున రోజుకు రూ.1 కోటి నష్టపోతున్నారని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఈ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా పోలీసు శాఖ 'జాగృత్ హైదరాబాద్ – సురక్షిత్ హైదరాబాద్' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఆదివారం నాడు డీజీపీ బి. శివధర్ రెడ్డితో కలిసి కమిషనర్ సజ్జనార్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 'సైబర్ సింబా' లోగో, క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించి, వాలంటీర్లకు బ్యాడ్జీలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, ఇది ఇప్పుడు ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వీయ అవగాహనతోనే ఈ నేరాలను అరికట్టగలమని, అందుకే తెలంగాణ వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. "నేరగాళ్లు వ్యక్తుల సంపద, వయసు, చిరునామా వంటి వివరాలు సులభంగా సేకరించి ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధులు, గృహిణులను లక్ష్యంగా చేసుకుని, వారిని భయపెట్టి డబ్బులు కాజేస్తున్నారు" అని ఆయన వివరించారు.