|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 04:34 PM
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఈలోగా తుది నిర్ణయాన్ని ప్రకటించాలని ధర్మాసనం స్పష్టంగా ఆదేశించింది.గతంలో జులై 31వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ బీఆర్ఎస్ పార్టీ రెండు పిటిషన్లు దాఖలు చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయని స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ తన పిటిషన్లలో కోరింది.అయితే, బీఆర్ఎస్ పిటిషన్లు వేయడానికి ముందే స్పీకర్ కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారమే అనర్హత ప్రక్రియను ప్రారంభించానని, అయితే నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు.ఇవాళ ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం, ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకుంది. స్పీకర్‌కు చివరి అవకాశంగా నాలుగు వారాల గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను కూడా నాలుగు వారాలకు వాయిదా వేసింది.