|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 07:39 PM
తెలంగాణలోని ఇండ్లు లేని నిరుపేదలకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్‌న్యూస్ చెప్పారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేసి అర్హత కలిగిన వారందరికీ ఇస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కరీంనగర్‌లో ప్రచారం నిర్వహించిన ఆయన.. పట్టణ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. తమను గెలిపిస్తే.. కరీంనగర్ పట్టణ అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందన్నారు. గత 10 ఏళ్లలో మొత్తం నియోజకవర్గంలో 600 డబుల్ బెడ్ రూం ఇండ్లు అసంపూర్తిగా నిర్మించి ఒక్కరికి కూడా ఇవ్వలేదని విమర్శించారు. తామ అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేసి అర్హత కలిగిన వారందరికీ ఇస్తామన్నారు. ఏడాదిలోనే నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. రేషన్ కార్డులుతో పాటు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఎన్నో అమలు చేస్తున్నామన్నారు.
గత 10 సంవత్సరాలుగా కరీంనగర్ పట్టణానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీని డిమాండ్ చేశారు. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కరీంనగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే మేయర్ అవుతారని.. మేయర్‌ను కూడా ముందే ప్రకటిస్తామని చెప్పారు.
ఇక ఇళ్లు లేని నిరు పేదలకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైతం శుభవార్త చెప్పారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లోనూ అర్హులైన వారందరకీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం నాలుగున్నర లక్షల ఇళ్లు ఇప్పటికే నిర్మించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖాళీ స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, ఖాళీ జాగా లేని వారికి జీ ప్లస్ 2 తరహాలో నివాసాలు నిర్మించి ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని అన్ని వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధే తమ ప్రభుత్వం ధ్యేయమన్నారు.