|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:35 PM
తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, సజావుగా నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.ఎన్నికల ప్రచారం ముగిసే సమయమైన ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు ఎన్నికల, ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా ఓట్ల లెక్కింపు జరిగే ఈ నెల 13వ తేదీన కూడా పూర్తిస్థాయిలో వైన్స్, బార్లను మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.