|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:44 PM
సిద్దిపేట జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఆదివారం ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో ఏకంగా ఆరు పశువులను చంపేయడంతో పలు గ్రామాలు వణికిపోతున్నాయి. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు, పులిని పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.కోహెడ మండలం ఆరెపల్లి సమీపంలోని చంద్రానాయక్ తండాలో మలోత్ రమేశ్ అనే రైతుకు చెందిన ఐదు పశువులపై పులి దాడి చేసి చంపేసింది. ఇదే తరహాలో నంగునూరు మండలం ఘనాపూర్‌లో బాల్ రెడ్డి అనే రైతుకు చెందిన లేగదూడను హతమార్చి, మరో పశువును గాయపరిచింది. శనివారం జనగామ జిల్లా నుంచి సిద్దిపేట జిల్లాలోని దూల్మిట్ట మండలంలోకి ప్రవేశించిన ఈ పులి, అక్కడి నుంచి నంగునూరు, కోహెడ మండలాల్లోకి ప్రవేశించినట్టు అధికారులు గుర్తించారు.ఈ పులి మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించి, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల మీదుగా వందల కిలోమీటర్లు ప్రయాణించి సిద్దిపేటకు చేరుకున్నట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. తనకంటూ ఒక కొత్త ఆవాసాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలోనే ఇది పశువులపై దాడి చేస్తుండవచ్చని అంచనా వేస్తున్నారు.