![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 04:33 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ సేవలో, చంద్రబాబు సేవలో నిమగ్నమయ్యారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు 'ఎక్స్' వేదికగా విమర్శలు గుప్పించారు.గవర్నర్ ప్రసంగంలో దశ, దిశ లేదని అన్నారు. గత ఏడాది గవర్నర్ ప్రసంగానికి, ఈసారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏమీ లేదని పేర్కొన్నారు. గవర్నర్లు మారారు తప్పితే, ప్రసంగాలు మాత్రం మారలేదని ఎద్దేవా చేశారు. చేయనివి చేసినట్లు, ఇవ్వనివి ఇచ్చినట్లు, అబద్ధాలతో కూడిన ప్రసంగాన్ని ప్రభుత్వం గవర్నర్‌తో చెప్పించిందని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఏడాదిన్నర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనమని అన్నారు. అబద్ధాల ప్రచారాన్ని నమ్మించడానికి గవర్నర్ ప్రసంగాన్ని వాడుకోవడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు."నిన్ను నువ్వు కనుగొనడానికి అత్యుత్తమ మార్గం ఇతరుల సేవలో నిమగ్నమవ్వడమే" అని మహాత్మాగాంధీ చెప్పిన మాటలతో గవర్నర్ 32 పేజీల ప్రసంగాన్ని మొదలు పెట్టారని అన్నారు. అయితే, నిజానికి రేవంత్ రెడ్డి అత్యుత్తమ మార్గం కోసం ఢిల్లీ సేవలో, చంద్రబాబు సేవలో నిమగ్నమయ్యాడని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పాలనలో జీవితాలు మారుతున్నాయని గవర్నర్ ప్రసంగంలో చెప్పారని, ఎవరి జీవితాలను మార్చారని ప్రశ్నించారు. లగచర్ల, న్యాలకల్, అశోక్ నగర్‌లో రైతులను, నిరుద్యోగులను పోలీసులతో కొట్టించడం, ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం... ఇదేనా మీరు చెప్పిన ట్రాన్స్ ఫార్మింగ్ లైవ్స్ అని నిలదీశారు. ఈరోజు కూడా ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసి ప్రజాపాలన పేరిట పెద్ద ట్రాన్స్‌ఫర్మేషన్ చేశారని ఎద్దేవా చేశారు.ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్ అంటే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కావాలని అన్నారు. అంతేగానీ కాంగ్రెస్ మంత్రులు, నాయకులు, ఢిల్లీ అభివృద్ధి కాదని వ్యాఖ్యానించారు. 20 శాతం కమీషన్లు తీసుకోవడమేనా మీరు చెప్పిన ఇంక్లూజివ్ డెవలప్‌మెంటా అని నిలదీశారు. స్వయంసేవ, ఢిల్లీ సేవలోనే రేవంత్ రెడ్డి, మంత్రివర్గం తరిస్తోందని, ఇక ప్రజాసేవ ఎక్కడ అని నిలదీశారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చారని, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిది పెట్టారని ఆరోపించారు. ఇది తెలంగాణ సంస్కృతి అభివృద్ధికి చేపట్టిన చర్య అవుతుందా అని ప్రశ్నించారు.తెలంగాణను 34 లక్షల ఎకరాల నుండి కోటి ఎకరాల మాగాణంగా మార్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వల్ల సాధ్యమైనట్టు తెలిపారు. 260 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి రికార్డు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని, అది మీ ఏడాదిన్నర పాలనలో సాధ్యమైందా అని ప్రశ్నించారు.రుణమాఫీ పెద్ద బోగస్ అని హరీశ్ రావు విమర్శించారు. రైతు భరోసాను రూ.15 వేల నుంచి రూ. 12 వేలకు తగ్గించారని విమర్శించారు. రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తున్నామని గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారని అన్నారు. కనీసం ఒక్క రూపాయి అయినా ఎవరి ఖాతాల్లో అయినా పడిందా చెప్పాలని నిలదీశారు. రైతు వేదికలు కట్టిన ఘనత కూడా మీ ఖాతాలో వేసుకుంటారా? అని చురక అంటించారు. కేసీఆర్ చేసిన పనులను ఆయన సమక్షంలోనే (అసెంబ్లీలో) మీ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.చేనేతలకు ఉన్న పథకాలను రద్దు చేశారని, కొత్త పథకాన్ని ప్రకటించినప్పటికీ, అది కూడా రుణమాఫీ, రైతు భరోసాలాగే అమలు కాకుండా ఉంటుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. బోనస్ విషయంలో అబద్ధాలు చెప్పారని విమర్శించారు. 445 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. రైతు బీమా డబ్బులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.కృష్ణా జలాల గురించి గొప్పలు చెబుతున్నారని, కానీ ఈ నీళ్లను ఆంధ్రా దోచుకుంటుంటే కాంగ్రెస్ వాళ్లు మౌనంగా ఉండి, ఇప్పుడు మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి మొదటి హామీ నెలకు రూ.2,500 ఇప్పటికీ దిక్కులేదని విమర్శించారు. కానీ దీనిని గేమ్ ఛేంజర్ అని చెప్పుకోవడం విడ్డూరమని అన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.55 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు అబద్దం చెప్పించారని, కనీసం పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అన్నారు. జాబ్ క్యాలెండర్‌ను కాస్త జాబ్ లెస్ క్యాలెండర్ చేశారన్నారు. నిరుద్యోగ భృతి ఊసే లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి యువతను మోసం చేశారని అన్నారు.విద్యావ్యవస్థ నిర్వీర్యం చేశారని విమర్శించారు. గురుకులాల్లో 83 మంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదని, పోలీసు భద్రత అమలు కావడం లేదని, గొప్పలు మాత్రం చెప్పుకుంటున్నారని విమర్శించారు. బీసీల కులగణన తప్పుల తడకగా ఉందని, ఏ ప్రాతిపదికన బిల్లు పెడతారని ప్రశ్నించారు.