|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 01:05 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హరీశ్ రావును ఎదుర్కోలేక ఆయనపై తప్పుడు కేసులు పెట్టి నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా స్పందించారు.రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయిందని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని, ఆ కేసును కొట్టివేసిందని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతోనే ఫోన్ ట్యాపింగ్ కేసు డ్రామా ముగిసిపోయిందని, అయినప్పటికీ మళ్లీ హరీశ్ రావుకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతోందని ఆయన మండిపడ్డారు.రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డికి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించే 'డైవర్షన్ పాలిటిక్స్'కు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. హరీశ్ రావు తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడని ఆయన కొనియాడారు.అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడటంలో కానీ ఆయన చూపిస్తున్న చొరవను చూసి రేవంత్ రెడ్డికి వణుకు పుడుతోందని ఆయన అన్నారు. అందుకే రాజకీయంగా ఎదుర్కోలేక, ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. గత 24 నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ దారుణమైన పాలనను నిలదీస్తున్నందుకే హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.