|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 12:10 PM
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పెద్దచెరువు ఎఫ్‌టీఎల్ హద్దులను నిర్ధారించాలని పలువురు హైడ్రాను కోరారు. ప్రతి ఏటా అమీన్‌పూర్ చెరువులో నీటి నిలువల స్థాయి పెరుగుతుండడంతో తమ ఇళ్లతో పాటు.. ప్లాట్లు నీట మునుగుతున్నాయని వాపోయారు. ఎఫ్‌టీఎల్, బఫర్ హద్దులను నిర్ధారించి తమకు న్యాయం చేయాలని పలువురు కోరారు. సోమవారం నాటి ప్రజావాణికి పెద్దయెత్తున హాజరై వినతిపత్రాలు అందజేశారు. చెరువును ప్రభుత్వం అభివృద్ధి చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో అందులో ప్లాట్లు, ఇళ్లు కోల్పోయినవారిని కాపాడాలని కోరారు. మరో దారి లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా స్థలాలు చూపించాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్‌పేట విలేజ్‌లోని శబరిహిల్స్ లే ఔట్‌లో రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాకు గురౌతున్నాయని అక్కడి స్థానికులు ఫిర్యాదు చేశారు. సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 43 ఫిర్యాదులందాయి. ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పరిశీలించి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, చందానగర్ లోని సిటిజెన్స్ కాలనీ పార్కు ఆక్రమణకు గురి అవుతోందని స్థానికులు ఫిర్యాధు చేసారు. హుడా అనుమతి పొందిన లేఔట్ లోని పార్కును ఆక్రమించేసి.. చెత్త డంపింగ్ కేంద్రంగా అక్కడి వ్యాపారి వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. అలాగే రహదారులను కూడా ఆక్రమించి టెంపరరీ షెడ్డులు వేసి వ్యాపారాలు చేసుకుంటున్నారని సిటిజెన్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు.