|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 01:12 PM
సైబర్ నేరగాళ్లు ఏకంగా హైదరాబాద్‌లోని ఓ పోలీసు ఉన్నతాధికారికే టోకరా వేసేందుకు ప్రయత్నించారు. ఖైరతాబాద్ డీసీపీగా పనిచేస్తున్న శిల్పవల్లికి సైబర్ కేటుగాళ్లు ఓవర్ స్పీడ్ పేరిట మెసేజ్‌లు పంపించారు. మీ వాహనం అధిక వేగంతో వెళ్లినట్లు కెమెరాల్లో రికార్డయినదని పేర్కొంటూ, మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు సందేశాలు పంపించారు.చలాన్ వివరాలు చూడాలంటే తాము పంపిన లింక్‌పై క్లిక్ చేయాలని ఆ మెసేజ్‌లలో సూచించారు. అంతేకాకుండా చివర్లో ‘ట్రాఫిక్ నియమాలు పాటించండి’ అంటూ సందేశాన్ని ముగించడం విశేషం.అయితే ఈ మెసేజ్‌లు నకిలీవని గుర్తించిన డీసీపీ శిల్పవల్లి ఆ లింక్‌ను క్లిక్ చేయకుండా ‘సంచారాధి’ యాప్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ‘ఎక్స్’ వేదికగా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇలాంటి అనుమానాస్పద లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.