|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 03:06 PM
తిలకం పెట్టుకుని స్కూలుకు వెళ్లిన ఎనిమిదేళ్ల బాలుడికి వింత పరిస్థితి ఎదురైంది. నుదుట తిలకం చూసి ఇదేం ఆచారమంటూ తోటి పిల్లలతో పాటు టీచర్లు కూడా పదేపదే ఆరాతీస్తూ ప్రత్యేకంగా చూడడంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. బాలుడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు ఆ స్కూలు మానిపించేసి మరో స్కూలులో చేర్పించారు. లండన్ లోని ఓ స్కూలులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..లండన్ లోని హిందూ కుటుంబానికి చెందిన బాలుడు ఇటీవల నుదుట తిలకం పెట్టుకుని స్కూలుకు వెళ్లాడు. తిలకంతో వచ్చిన ఆ బాలుడిని తోటి విద్యార్థులు వింతగా చూశారు. టీచర్లు సైతం ఆశ్చర్యంగా బాలుడి మతవిశ్వాసాల గురించి ఆరాతీశారు. పిల్లలంతా ఆడుకునే సమయంలో హెడ్ టీచర్ ఈ బాలుడిపై ప్రత్యేకంగా దృష్టి సారించేవారు. ఈ పరిణామాలతో బాలుడు భయాందోళనలకు గురయ్యాడు. ఈ వివక్ష వల్ల తమ బాబును స్కూలు మార్చాల్సి వచ్చిందని తల్లిదండ్రులు వాపోయారు.తమ మత విశ్వాసాల గురించి పాఠశాల యాజమాన్యానికి వివరించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయిందని బాలుడి తల్లిదండ్రులు వెల్లడించారు.