|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 12:45 PM
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక, తన రాజకీయ భవిష్యత్తుపై కల్వకుంట్ల కవిత పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలను ఆమె ముమ్మరం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, కార్యాచరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) ఆమెకు సహాయం అందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.గత రెండు నెలల వ్యవధిలో ప్రశాంత్ కిశోర్ రెండుసార్లు హైదరాబాద్ వచ్చి కవితతో రహస్యంగా సమావేశమయ్యారని సమాచారం. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా వీరి మధ్య భేటీ జరిగినట్లు తెలుస్తోంది. కొత్త పార్టీని ప్రకటిస్తే రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి, పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, అనుసరించాల్సిన వ్యూహాలు వంటి కీలక అంశాలపై వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సమావేశాలపై కవిత గానీ, తెలంగాణ జాగృతి ప్రతినిధులు గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.