|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 01:19 PM
ఐటీ సంస్థ విప్రోపై నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ కేంద్ర కార్మిక శాఖ మంత్రికి ఫిర్యాదు చేసింది. క్యాంపస్ నియామకాల ద్వారా ఎంపిక చేసిన 250 మందికి పైగా ఫ్రెషర్లను ఇప్పటికీ ఉద్యోగంలోకి తీసుకోకుండా జాప్యం చేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ‘నైట్స్’ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా కేంద్ర మంత్రికి ఒక లేఖ రాశారు.వివరాల్లోకి వెళితే... దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని కళాశాలల నుంచి విప్రో ఎంపిక చేసిన 250 మందికి పైగా అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు జారీ చేసింది. చాలా సందర్భాల్లో, ఉద్యోగంలో చేరాల్సిన తేదీ, ప్రదేశంతో కూడిన కన్ఫర్మేషన్ ఈ-మెయిల్స్ కూడా పంపింది. అభ్యర్థుల నుంచి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియలన్నీ పూర్తి చేసినప్పటికీ, గత 6 నుంచి 8 నెలలుగా వారిని ఆన్‌బోర్డింగ్ చేసుకోలేదని ‘నైట్స్’ తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై అభ్యర్థులు ఎన్నిసార్లు సంప్రదించినా, సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదని లేదా ‘వ్యాపార అవసరాలు’ అంటూ ఆటోమేటెడ్ సమాధానాలు వస్తున్నాయని తెలిపింది.ఈ కాలంలో విప్రో ఇతర అభ్యర్థులను ఉద్యోగంలోకి తీసుకుందని, కానీ ఈ 250 మందిని మాత్రం అనిశ్చితిలో వదిలేసిందని హర్‌ప్రీత్ సింగ్ సలూజా ఆరోపించారు. సంస్థ జారీ చేసిన ఆఫర్ లెటర్లలో నియామకాలను నిరవధికంగా వాయిదా వేసే హక్కు కంపెనీకి ఉంటుందనే విషయం పారదర్శకంగా వెల్లడించలేదని ఆయన స్పష్టం చేశారు. "ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి బాధితులు మమ్మల్ని ఆశ్రయించారు. ఇది సంస్థ నియామక ప్రక్రియలోని లోపాన్ని సూచిస్తోంది" అని ఆయన తన లేఖలో వివరించారు.