|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 02:49 PM
సరకు రవాణా వాహనాల పన్నుల విధానంలో కీలక మార్పులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏళ్లుగా అమల్లో ఉన్న త్రైమాసిక (ప్రతి మూడు నెలలకోసారి) పన్ను చెల్లింపు విధానానికి స్వస్తి పలికి, దాని స్థానంలో జీవితకాల పన్ను (లైఫ్‌టైమ్ ట్యాక్స్) విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మార్పు ద్వారా వాహనాల యజమానులకు ఊరట కల్పించడంతో పాటు పన్ను ఎగవేతకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం రాష్ట్రంలోని సుమారు 25 శాతం గూడ్స్ వాహనాలు సరిగా పన్ను చెల్లించడం లేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లడమే కాకుండా, పన్నుల వసూలు కోసం అధికారులు తరచూ వాహనాలను ఆపి తనిఖీ చేయాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు, కొత్తగా కొనుగోలు చేసే సరకు రవాణా వాహనాలకు రిజిస్ట్రేషన్ సమయంలోనే జీవితకాల పన్ను వసూలు చేయాలని రవాణా శాఖ ప్రతిపాదిస్తోంది. వాహనం ధరలో 7.5 శాతాన్ని లైఫ్‌టైమ్ ట్యాక్స్‌గా నిర్ణయించే అవకాశం ఉంది. ఈ అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే అసెంబ్లీలో సూచనప్రాయంగా వెల్లడించారు.ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే వాహన యజమానులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి పన్ను చెల్లించే భారం, గడువు మరచిపోతే విధించే జరిమానాల బెడద తప్పుతుంది. అధికారుల తనిఖీల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే, ఈ కొత్త నిబంధన కేవలం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని, పాత వాహనాలకు యథావిధిగా త్రైమాసిక పన్ను విధానమే కొనసాగుతుందని స్పష్టమవుతోంది.