|
|
by Suryaa Desk | Tue, Jan 20, 2026, 03:35 PM
భారత్‌లోని ఉద్యోగుల్లో ఓ ఆసక్తికరమైన వైరుధ్యం కనిపిస్తోంది. దాదాపు 95 శాతం మంది తమ నైపుణ్యాలపై పూర్తి విశ్వాసంతో ఉన్నప్పటికీ, కేవలం 64 శాతం మంది మాత్రమే తమ ఉద్యోగంతో సంతృప్తిగా ఉన్నట్లు మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా ఇవాళ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా ఉద్యోగుల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఈ నివేదికను రూపొందించారు.నివేదిక ప్రకారం తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించగలమనే నమ్మకం 95 శాతం మందిలో ఉంది. కెరీర్ డెవలప్‌మెంట్ అవకాశాలు ఉన్నాయని 90 శాతం, ప్రమోషన్లు వస్తాయని 84 శాతం, ఏఐ (AI) టెక్నాలజీని వాడటంలో నమ్మకంగా ఉన్నామని 90 శాతం మంది తెలిపారు. అయితే, ఈ ఆత్మవిశ్వాసం వారిలో ఉద్యోగ సంతృప్తిని పెంచడం లేదని నివేదిక స్పష్టం చేసింది. సుమారు 53 శాతం మంది రోజూ తీవ్రమైన లేదా ఒక మోస్తరు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తేలింది.మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా, మిడిల్ ఈస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ గులాటి మాట్లాడుతూ.. "అధిక పనిభారం, ఎక్కువ పని గంటల కారణంగా 75 శాతం మంది బర్న్‌అవుట్‌కు గురవుతున్నారు. చాలామంది కొత్త అవకాశాల కోసం చూస్తున్నప్పటికీ, దాదాపు సగం మంది భద్రత కోసం ఉన్న ఉద్యోగాన్నే అంటిపెట్టుకుని ఉంటున్నారు" అని వివరించారు.