![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 17, 2025, 04:30 PM
యూట్యూబ్ జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌లకు బెయిల్ మంజూరు అయింది. హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు విచారణ న్యాయస్థానం.. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన ఓ రైతు వీడియోను పోస్ట్ చేయడమే పెద్ద నేరమైంది. ప్రజా సమస్యలను తమ చానల్ ద్వారా ప్రసారం చేయడమే కాంగ్రెస్ సర్కారుకు కంటగింపుగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అంటూ మహిళా జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.గత బుధవారం తెల్లవారుజామున 4గంటలకే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ‘పల్స్ న్యూస్ బ్రేక్’ చానల్ జర్నలిస్ట్ రేవతి ఇంటికి 18 మంది పోలీసులు చేరుకున్నారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు జర్నలిస్ట్ రేవతిని అరెస్టు చేస్తున్నామంటూ తన ఫోన్‌తోపాటు ఆమె భర్త ఫోన్‌ను లాక్కున్నారు. ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా ఓరైతు మాట్లాడిన వీడియోను తన యూట్యూబ్ చానల్‌లో పోస్టు చేసినందుకు అరెస్టు చేస్తున్నట్టు ఆమెకు నోటీసు ఇచ్చారు. అదే సమయంలో కొత్తూరులో మరో మహిళా జర్నలిస్ట్ సంధ్య అలియాస్ తన్వీ యాదవ్ ఇంటికి పోలీసులు వెళ్లి ఆమెను కూడా అరెస్ట్ చేశారు. అరెస్టుల అనంతరం వీరిద్దరిని 8గంటల పాటు రహస్యంగా విచారించారు.