|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 06:12 AM
హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. 'ఓటుకు నోటు' కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కుట్ర పన్నారని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రాయోజిత ఘటనే అని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై తక్షణమే న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.ఆదివారం నాడు హనుమకొండలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 'ఓటుకు నోటు' కేసు తుది తీర్పు దశకు చేరుకున్న సమయంలో, సాక్ష్యాలను శాశ్వతంగా నాశనం చేయాలనే దురుద్దేశంతోనే ఈ ప్రమాదాన్ని సృష్టించారని అన్నారు. అత్యంత భద్రత ఉండే ల్యాబ్‌లో, అదీ శీతాకాలంలో మంటలు చెలరేగడం, 24 గంటలూ సిబ్బంది ఉండాల్సిన చోట ఎవరూ లేకపోవడం వంటివి అనేక అనుమానాలకు తావిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.ప్రారంభంలో స్వల్ప నష్టమే జరిగిందని అధికారులు చెప్పారు. కానీ ఆ తర్వాత 2015 నుంచి పదేళ్ల విలువైన సాక్ష్యాధారాలు పూర్తిగా కాలిపోయాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొనడం కుట్ర అనే అనుమానాన్ని బలపరుస్తోంది" అని కేటీఆర్ వివరించారు. కేవలం ఒక అంతస్తుకు పరిమితమైన మంటలను ఆర్పేందుకు మూడున్నర గంటలకు పైగా సమయం ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనలో దాదాపు 50 కంప్యూటర్లు, సర్వర్లు, డిజిటల్ రికార్డులు కాలిపోయాయని ఆరోపించారు.ఈ ప్రమాదంలో వేలాది తీవ్రమైన క్రిమినల్ కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా ధ్వంసమయ్యాయని, ఇది ప్రజా భద్రతకు పెను ముప్పు అని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ పెద్దల అండతోనే ముఖ్యమంత్రి ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తూ, దీనిపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, వారు సీఎంకు ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్నారని విమర్శించారు. ఘటనపై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని, అఖిలపక్ష బృందాన్ని ఎఫ్‌ఎస్‌ఎల్ ప్రాంగణాన్ని సందర్శించేందుకు అనుమతించాలని కోరారు.