|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 06:21 AM
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రజలను బ్లాక్‌మెయిల్ చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అంటే 'బ్లాక్‌మెయిల్ రాజకీయ సమితి' అని అభివర్ణించిన ఆయన, ఫోన్ ట్యాపింగ్‌తో వందల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ.1,500 కోట్లు అక్రమ మార్గాల్లో సంపాదించినవేనని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ములుగు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.పదేళ్ల పాలనలో అధికారాన్ని దుర్వినియోగం చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమ సంపదను కూడబెట్టారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి, వారి ఆస్తులను బలవంతంగా బదిలీ చేయించుకున్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, సినీ తారలనే కాకుండా చివరికి భార్యాభర్తల మధ్య సంభాషణలను కూడా విన్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కాళేశ్వరం, ఫార్ములా-ఈ రేస్ కుంభకోణాలపై సీబీఐ విచారణకు ఆదేశించకపోవడంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 'కిషన్ రావు'గా మారి కేసీఆర్‌కు దత్తపుత్రుడిగా మారారని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై సీబీఐ, ఈడీ కేసులు పెట్టిన కేంద్రం, కాళేశ్వరం స్కామ్‌పై విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను కిషన్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒకే నాణేనికి రెండు ముఖాలని, కాంగ్రెస్‌ను ఓడించేందుకు రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని అన్నారు.కేసీఆర్ కుటుంబం టీవీ ఛానెళ్లు, వార్తాపత్రికలతో వేల కోట్ల వ్యాపారాలు సంపాదించింది కానీ, పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టివ్వలేదని రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోందని, రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు కట్టిస్తున్నామని తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారనేది అవాస్తవమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చించకుండా, ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఏ జిల్లాను రద్దు చేసేది లేదని హామీ ఇచ్చారు.