by Suryaa Desk | Wed, Jan 01, 2025, 04:34 PM
ఐశ్వర్య రాజేశ్ కెరియర్ ను పరిశీలిస్తే, ఈ మధ్య కాలంలో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కావడం కనిపిస్తుంది. ఓటీటీలోని తమిళ అనువాదాలు ఇక్కడి ప్రేక్షకులను ఆమె అభిమానులుగా మార్చాయి. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఈ నెల 14వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా 'టీవీ 5'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేశ్ మాట్లాడారు. "తెలుగులో నేను చేసిన లాస్ట్ మూవీ 'రిపబ్లిక్'. ఆ సినిమా తరువాత మంచి పాత్రలు రాకపోవడం వలన నేను చేయలేకపోయాను. ఒక రోజున అనిల్ రావిపూడి కాల్ చేసి .. ఈ సినిమా గురించి చెప్పారు. ఆడిషన్ ఇవ్వమని అంటే ఇచ్చాను. ఆ తరువాత నాకు ఆయన కథ చెప్పారు. ఫస్టాఫ్ కథను చెప్పడానికి ఆయన 3 గంటలు తీసుకున్నారు. వింటున్నంత సేపు నేను నవ్వుతూనే ఉన్నాను" అని అన్నారు. " ఈ సినిమా కథ వింటున్న సమయంలో నాకు అసలు సమయమే తెలియలేదు. 'భాగ్యం పాత్రను గురించి తెలుసుకున్నాక తప్పకుండ చేయాలని అనుకున్నాను. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక సినిమా నేను చూడలేదు అనుకున్నాను. 'భాగ్యం' పాత్ర దక్కడం నేను చేసుకున్న పుణ్యమని మా అమ్మగారితో చెప్పాను. ఈ పాత్రను నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. వెంకటేష్ గారు ఎంతో ప్రోత్సహించారు. ఈ సినిమాలో నా పాత్రకి దక్కే క్రెడిట్ అంతా అనిల్ రావిపూడికే వెళుతుంది" అని చెప్పారు.
Latest News