![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 17, 2025, 07:23 PM
తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఇకపై తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు కూడా శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కేటాయింపు ఉంటాయని టీటీడీ వెల్లడించింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రజాప్రతినిధులను అప్పటి టీటీడీ పాలకులు, అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు, టీటీడీ ఛైర్మన్ బీఅర్ నాయుడు ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరించే విధానం అమలు కానుంది.సోమ, మంగళవారాల్లో తెలంగాణ సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయింపు ఉంటుంది. అలాగే బుధ, గురువారాల్లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రజాప్రతినిధి తాలూకు ఒక సిఫార్సు లేఖపై ఆరుగురికి మించకుండా దర్శన అవకాశం కేటాయించనుంది. ఏపీ ప్రజా ప్రతినిధులకు ఇకపై సోమవారం దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. దానికి బదులుగా ఆదివారం దర్శనం కోసం శనివారం నాడు టీటీడీ లేఖలు స్వీకరించనుంది. సుదీర్ఘంగా చర్చించి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని సిబ్బందికి సహకరించాలని భక్తులను టీటీడీ కోరింది.