|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 02:43 PM
వ్యవస్థల పట్ల, వాటి పని తీరుతో పాటు పౌరుల హక్కులకు సంబంధించి అందరిలోనూ అవగాహన ఉన్నప్పుడు అవినీతి నిర్మూలన సాధ్యమౌతుందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అన్నారు. చట్టాలపైన అవగాహన కల్పించడంతో పాటు.. అనుసరించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వాటిని అమలు చేసేవారిపై ఉందన్నారు. గొలుసు కట్టు చెరువుల ప్రాధాన్యత, నాలాల అవశ్యకత, ప్రజావసరాలకు ఉద్దేశించిన భూముల పరిరక్షణ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలందరికీ తెలిసేలా హైడ్రా చర్యలు తీసుకుందన్నారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా BHEL నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ ఏవీ రంగనాథ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హైడ్రా రాక ముందు చెరువు FTL, బఫర్ పట్ల చాలా మందిలో అవగాహన లేదని.. ఇప్పుడు దాదాపుగా అందరికీ తెలిసేలా చేశామన్నారు. ఇటీవల హైడ్రా వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పాఠశాల విద్యార్థులు చెరువుల ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవెల్) బఫర్, నాలాల బఫర్‌ను కాపాడాల్సిన అవసరాన్ని కళ్లకు కట్టారన్నారు. ఇప్పుడు చెరువుల చెంత, నాలాల పక్కన ఇంటి స్థలం కొనేవారు పైన పేర్కొన్న లెక్కలన్నీ సరి చూసుకుని కొంటున్నారని హైడ్రా కమిషనర్ తెలిపారు. నగర భవిష్యత్తుకు హైడ్రా చేస్తున్న కృషికి ప్రజలందరి సహకారం లభిస్తుందంటే.. వాటి ఆవశ్యకతను తెలుసుకోవడంతోనే సాధ్యమైందని చెప్పారు. ఏడాదిలో దాదాపు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమని హైడ్రా కాపాడిందని అన్నారు. ఎన్ ఆర్ ఎస్ సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్) తెలిపిన వివరాల ప్రకారం నగరంలో 61 శాతం చెరువులు కనుమరుగయ్యాయయని.. ఇదే కొనసాగితే వచ్చే 15 ఏళ్లలో మొత్తం చెరువులు మాయం అవుతాయని హెచ్చరించారు. అందుకే చెరువులతో పాటు నాలాల పరిరక్షణకు హైడ్రా నడుం బిగించిందన్నారు. మొదటి విడతగా 6 చెరువులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకపోతే వరదలను నియంత్రించగలమని చెప్పారు. ఇలా హైడ్రా చేస్తున్న ప్రతీ చర్యా.. పారదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు. విజిలెన్స్ వారోత్సవాలను పాఠశాలల్లో నిర్వహించామని బీహెచ్ ఈ ఎల్ హైదరాబాద్ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ కేబీ రాజా గారు తెలిపారు. విద్యార్థి దశలోనే అవగాహన తీసుకువస్తే మంచి పౌరులుగా మారుతారన్నారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలైన ఉద్యోగులతో పాటు.. విద్యార్థలకు అవార్డులను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీహెచ్ ఈ ఎల్ లోని వివిధ విభాగాల్లోని అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.