|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 07:49 PM
తెలంగాణ ప్రభుత్వం వాట్సప్ మీ-సేవ విధానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానం ద్వారా పౌర సేవలు ఈజీ అయ్యాయి. ఆఫీసుల చుట్టూ తిరగకుండానే కావాల్సిన పత్రాలు పొందే అవకాశం దొరికింది. తాజాగా రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో ఎమర్జెన్సీ సేవలను కూడా మీ-సేవ విధానం ద్వారా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 101, 108, 102, గ్యాస్ సిలిండర్ బుకింగ్, ముఖ్యమైన హెల్ప్ లైన్ నంబర్లన్నింటినీ వాట్సప్ మీ-సేవకు లింకు చేయనున్నారు. 2025 నవంబరు 18న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వాట్సప్ మీ-సేవను ప్రారంభించగా.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మంది వివిధ పౌర సేవలకు ఇందులో నమోదు చేసుకున్నారు.
వీరిలోనూ 3.25 లక్షల మంది డిజిటల్ సర్వీసులు పొందారు. మీ-సేవ కేంద్రాల ఎదుట భారీ స్థాయిలో క్యూ కట్టే పనిలేకుండా.. పౌర సేవలను సులభతరం చేస్తూ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వాట్సప్ మీ-సేవ విధానం తక్కువ కాలంలోనే ప్రజలకు చేరువైంది. మొత్తంగా పదికి పైగా ప్రభుత్వ శాఖలకు చెందిన 581 రకాల సేవలను ప్రజలు ఈ ప్రత్యేక యాప్ ద్వారా వినియోగించుకుంటున్నారు. '80969 58096' వాట్సప్ నంబర్ ద్వారా నిర్విరామంగా 24 గంటలూ పౌర సేవలు పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలు కల్పించింది. ప్రశ్నలు అడగడానికి, దరఖాస్తు చేసుకోవడానికి, చెల్లింపులు చేయడానికి, అఫ్లికేషన్ స్టేటస్ తనిఖీ చేయడానికి సందేశం పంపి.. వివరాలు తెలుసుకోవచ్చు. డిజిటల్ టెక్నాలజీపై అవగాహన లేనివారికి కూడా ఈజీగా అర్థమయ్యేలా ఈ విధానాన్ని రూపొందించారు. రాష్ట్రంలోని 31 ప్రధాన దేవాలయాలకు సంబంధించిన సేవలు కూడా ఇందులో ఉన్నాయి. దర్శనం, వసతి తదితర సేవలు వాట్సప్ మీ-సేవ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
వాట్సప్ మీ-సేవతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేలకు పైగా మీ-సేవ కేంద్రాలు ప్రతిరోజూ 80 వేల మంది నుంచి లక్ష మంది డిజిటల్ పౌర సేవలు పొందుతున్నారని మీ-సేవా కమిషనర్ రవికిరణ్ వెల్లడించారు. 2023 నవంబరు 1 నుంచి 2026 జనవరి 31 వరకు.. 5.98 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయని తెలిపారు. వీటి మొత్తం విలువ దాదాపు రూ.3,811 కోట్లు అని వెల్లడించారు. సర్టిఫికెట్ల స్టేటస్, తాజా అప్‌డేట్స్ కూడా వాట్సప్‌లోనే తెలుసుకోవటం, ఆమోదించిన సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. దీని ద్వారా పదే పదే మీ-సేవా కేంద్రాలకు వెళ్లే శ్రమ తగ్గిందని.. మధ్యవర్తుల పాత్ర తొలగిపోయిందని తెలిపారు. పౌర సేవల వేగం పుంజుకోవటంతో పాటు.. దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరింత చేరువైందని వెల్లడించారు. త్వరలో అత్యవసర సేవల నంబర్లను కూడా వాట్సప్ మీ-సేవకు అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు.