|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 04:11 PM
మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ, రుద్రారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన 23వ, 24వ, 25వ, 26వ వార్డుల అభ్యర్థులు భారీ రోడ్డుషో ర్యాలీని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ–ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు, పటాన్‌చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు, మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ గారు, స్థానిక ఇన్‌చార్జ్ బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ గారు, మాజీ ఎంపీటీసీ గడీల కుమార్ గౌడ్ గారు పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత పదేళ్ల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, గృహలక్ష్మి, కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు వంటి అనేక ప్రజాప్రయోజన పథకాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపాయని పేర్కొన్నారు.అదేవిధంగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను దొంగ హామీలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ రోజున కారు గుర్తుకు ఓటు వేసి, పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రుద్రారం మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ మన్నే రాజు గారు, సత్యనారాయణ రెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ఎండిఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.