|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 06:11 PM
తెలంగాణలో మూడో డిస్కమ్ తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్‌పీడీసీఎల్)ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న తెలంగాణ సదరన్, నార్తర్న్ డిస్కమ్‌లతో పాటు ఈ కొత్త టీజీఆర్‌పీడీసీఎల్ డిస్కమ్ కూడా సేవలు అందించనుంది. అయితే ఈ మూడో కొత్త డిస్కమ్ రాష్ట్రంలోని వ్యవసాయం, ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ సహా మిగిలిన వాటి విద్యుత్ అవసరాలను తీర్చనుంది.
తెలంగాణలో ఇప్పటికే ఉన్న 2 విద్యుత్ పంపిణీ సంస్థలకు అదనంగా మూడో డిస్కంను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన ఈ డిస్కం బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ ఫరూఖీకి అప్పగించింది. ఈ నేపథ్యంలోనే టీజీఆర్‌పీడీసీఎల్ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ముషారఫ్ అలీ ఫరూఖీని నియమించింది. ఇక టీజీఆర్‌పీడీసీఎల్ కార్యకలాపాల పర్యవేక్షణకు ఛైర్మన్‌తోపాటు మరో నలుగురు డైరెక్టర్లను కూడా నియమించారు.
ఈ కొత్త డిస్కం టీజీఆర్‌పీడీసీఎల్ కేవలం సాధారణ విద్యుత్ పంపిణీ చేయడం మాత్రమే కాకుండా.. వ్యవసాయం, ప్రజా అవసరాలకు సంబంధించిన విద్యుత్ సరఫరాను పర్యవేక్షించనుంది. రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మెయింటెనెన్స్, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయనుంది. రైతులకు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయనుంది. తెలంగాణలోని భారీ, మధ్యతరహా ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఈ టీజీఆర్‌పీడీసీఎల్ విద్యుత్ సరఫరా చేయనుంది. మిషన్ భగీరథ, మున్సిపల్ వాటర్ సప్లై పథకం, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్‌కు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లను పర్యవేక్షించనుంది.
వ్యవసాయం, భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన విద్యుత్ సరఫరాను.. సాధారణ విద్యుత్ వినియోగదారులు, పరిశ్రమల విద్యుత్ అవసరాల నుంచి వేరు చేసి.. వేర్వేరు డిస్కమ్‌లకు అప్పగించడం ద్వారా విద్యుత్ సరఫరాను మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయం వల్ల రైతులకు విద్యుత్ కోతలు లేకుండా వారికి వచ్చే సమస్యలను పరిష్కారించే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్యుత్ రంగంలో ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద సంస్కరణల్లో ఈ నిర్ణయం ఒకటిగా నిలవనుంది.