|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 12:23 PM
ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి బాధితులకు ఇళ్ల పట్టాలు, మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడు చట్టబద్ధంగా, ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన వారిలో తొలి విడతగా 412 మందిని అర్హులుగా గుర్తించారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని 311 మందికి వెలుగుమట్లలోనే ఇళ్లు కేటాయించారు. మిగిలిన 101 మందికి వారి వారి మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఈ కాలనీని అన్ని మౌలిక సదుపాయాలు, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్‌లతో మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని మంత్రులు ప్రకటించారు.