|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 05:02 PM
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారం సమీపంలో ట్రావెల్ బస్సు బోల్తా పడటంతో నలుగురు దుర్మరణం చెందారు. 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 22 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది.
బస్సు బోల్తా పడటాన్ని గమనించిన సమీపంలోని టోల్ ప్లాజా సిబ్బంది వెంటనే స్పందించారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కారణమని భావిస్తున్నారు. బస్సు బోల్తా పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో.. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు.. 2023 మార్చి 13న ఇందల్వాయి మండలంలోనే ఘోర ప్రమాదం సంభవించింది. చంద్రాయణపల్లి తండా వద్ద ఎన్‌హెచ్ 44పై ప్రయాణిస్తున్న కారు.. అదుపు తప్పి కంటైనర్ ట్రక్కు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మూడేళ్ల వ్యవధిలో సరిగ్గా అదే రోజున, దాదాపు అదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు సంభవించడం విషాదకరం.
భయపెడుతున్న బస్సు ప్రయాణాలు..
తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా బస్సు ప్రమాదాలు భయపెడుతున్నాయి. 2025 అక్టోబర్ 24 తెల్లవారుజామునకర్నూలు జిల్లాలో బైక్‌ను ఢీకొట్టిన హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు చనిపోయారు. దీంతో రవాణా శాఖ రంగంలోకి దిగి ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేపట్టింది.
ఈ ప్రమాదం జరిగిన కొద్ది రోజులకే నవంబర్ 3న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పిదం ఏమీ లేనప్పటికీ.. చేవెళ్ల ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అందర్నీ బాధించింది. 2025 డిసెంబర్లో ఏపీలోని చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఓ ప్రయివేట్ బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. 9 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఇటీవలి కాలంలో బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటం, పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతుండటంతో.. ప్రయాణాలంటేనే భయపడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.