by Suryaa Desk | Sun, Dec 22, 2024, 02:50 PM
హీరో అల్లు అర్జున్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వాస్తవాలు వెల్లడించారని చెప్పారు. అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మీడియాతో వ్యాఖ్యానించడంపై చామల మండిపడ్డారు. అల్లు అర్జున్ మానవత్వం మరిచినట్లు ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు. హీరో ప్రెస్ మీట్ పై ఎంపీ స్పందిస్తూ.. ఎవరో రాసిచ్చిన నోట్ ను అల్లు అర్జున్ మీడియా ముందు చదివారని ఆరోపించారు. ఇది విడ్డూరంగా ఉందన్నారు. నిజ జీవితంలోనూ ఆయన నటిస్తున్నట్లే ఉందన్ని ఆరోపించారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ బాధ్యతగా ఉండాలంటూ అల్లు అర్జున్ కు ఎంపీ చామల హితవు పలికారు. ‘పుష్ప2’ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతిచ్చిన విషయాన్ని ఎంపీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. సినిమాకు సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారని చెప్పారు. సినిమా వాళ్లు కూడా అంతే బాధ్యతగా ఉండాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.