by Suryaa Desk | Wed, Dec 25, 2024, 11:11 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసుల దూకుడు.. ఆ వ్యవహారం నేపథ్యంలో బెన్‌ఫిట్ షోలు రద్దు చేయడం, టికెట్ల రేట్లు పెంపు ఉండవని ప్రభుత్వం తెగేసి చెప్పిన వేళ.. సినిమా ఇండస్ట్రీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య పెద్ద గ్యాప్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో వెల్లువెత్తిన విమర్శలు, వాటికి ముఖ్యమంత్రి సహా తెలంగాణ ప్రభుత్వం ఘాటుగా స్పందించిన తీరుతో.. తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అనేవరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టడంలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో.. టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయి అనేక విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సినీ పరిశ్రమ, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు తాజాగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ ప్రభుత్వం, టాలీవుడ్ ఇండస్ట్రీ మధ్య కీలక భేటీ జరగనుంది. ఈ భేటీకి టాలీవుడ్ నుంచి ప్రముఖ నటులు చిరంజీవి, వెంకటేష్ సహా నిర్మాతలు అల్లు అరవింద్.. దర్శకులు హాజరుకానున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను సమీక్షించుకునే ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ సహా పలువురు పాల్గొననున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి వివిధ సమస్యలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరపనున్నారు. పన్నుల విధానం, ఫిల్మ్ ఛాంబర్ ఫీల్, పరిశ్రమకు ఇన్‌సెంటివ్స్ ఇవ్వడం, సౌకర్యాల అభివృద్ధి, అలాగే ఇతర అనేక అంశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ చర్చలు టాలీవుడ్ ఇండస్ట్రీ అభివృద్ధికి దోహదం చేస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ భేటీ సినిమా పరిశ్రమకు కావాల్సిన ప్రాధాన్యతను కేటాయించడమే కాకుండా.. సమర్థవంతమైన పరిష్కారాలపై పునరాలోచన చేసే అవకాశం కూడా కల్పించనుందని పేర్కొంటున్నారు.
అయితే ప్రముఖంగా వీటి గురించే సమావేశం జరుగుతుందని చెబుతున్నప్పటికీ.. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్.. ఈ ఘటనల నేపథ్యంలో తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని ఇప్పటికే ప్రకటించడం, అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి, దేశ రక్షణకు సంబంధించిన సినిమాలకు మాత్రమే పన్ను మినహాయింపులు ఉంటాయని.. రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టం చేసింది. ఇలాంటి పరిణామాల మధ్య ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య జరగనున్న చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.