|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 08:31 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘రాహుల్ బంధు’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు నిధులతోనే ఈ ‘రాహుల్ బంధు’ పథకాన్ని ప్రారంభించారని ఆయన ఆరోపించారు. ఏడాదికి రూ.1000 కోట్లను రాహుల్ గాంధీకి పంపేలా ఈ పథకం అమలు చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ కుటుంబానికి ఎప్పుడు అవసరం వచ్చినా వేల కోట్ల రూపాయలను పంపేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.సిరిసిల్లలో సోమవారం నిర్వహించిన నూతన కౌన్సిలర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులు రైతు బంధు నిధులు వస్తాయని ఆశగా ఎదురుచూస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఇవ్వడంలో విఫలమైందని విమర్శించారు. ఇప్పటికే మూడుసార్లు రైతు బంధు చెల్లింపులు నిలిపివేసిందని, ఈసారి కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.‘రాహుల్ బంధు’ పథకం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి చెల్లించాల్సిన కప్పం కోసం పేదల భూములను స్వాధీనం చేసుకుని, ఇళ్లను కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు అనేక ప్రాంతాల్లో పేదల ఇళ్లను కూల్చివేసి వ్యాపారం చేస్తున్నారని అన్నారు.అడ్డగోలు హామీలు ఇచ్చి, డిక్లరేషన్ల పేరుతో ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.కాంగ్రెస్ పార్టీతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వచ్చి వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అందుకే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లును తీసుకువస్తామని తెలిపారు.ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని ఒత్తిడి తెస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వాల్సిందేనని, ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పిన మాటలనే తాము అసెంబ్లీలో ప్రస్తావిస్తామని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.