|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 02:13 PM
గుమ్మడిదల :గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం గ్రామ పరిధిలోగల సర్వేనెంబర్ 261 లోని 580 ఎకరాలలో ఆరుగాలం పంటలు పండి రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తున్న పచ్చని భూములను నేడు రాష్ట్ర ప్రభుత్వం, TGIIC సంస్థలు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా వ్యవహరిస్తూ అంగట్లో కూరగాయల్లాగా అమ్మకాలు చేపడుతోందని.. రైతు వ్యతిరేక నిర్ణయాలను విరమించుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష సైతం చేపడుతామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం ఉదయం స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి అన్నారం పరిధిలోని సర్వే నంబర్ 261లో గల వ్యవసాయ భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ పేరుతో చేపడుతున్న ఆగడాలను రైతులు స్వయంగా ఎమ్మెల్యే జిఎంఆర్ కు వివరించారు.
అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు గతంలో సర్వేనెంబర్ 261 లో వ్యవసాయ భూములకు సంబంధించిన 117 మంది రైతుల వివరాలను ప్రభుత్వ రికార్డుల్లో చేర్చడంతో పాటు పాస్ బుక్కులు సైతం అందించడం జరిగిందని తెలిపారు. నాటి నుండి నేటి వరకు ప్రతి రైతు తన కుటుంబంతో కలిసి కష్టపడుతూ పంటలు పండిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత TGIIC తో కలిసి రియల్ ఎస్టేట్ ఏజెంట్గా వ్యవహరిస్తూ.. పేద, సన్నకారు, మధ్యతరగతి వ్యవసాయ భూములను పరిశ్రమలకు కేటాయిస్తున్నామన్న పేరుతో బడా కంపెనీలకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు దారదత్తం చేస్తుందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే అన్నారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 261 లో గల 580 ఎకరాలను ప్రైవేటు పరిశ్రమలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పనంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ప్రజా అవసరాల కోసం రైతులను ఒప్పించి.. మెరుగైన నష్టపరిహారం అందించి తీసుకోవడం దేశవ్యాప్తంగా జరుగుతుందని.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం రైతులను బెదిరించి అక్రమంగా.. అన్యాయంగా పచ్చని పంట భూమాలను లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నారం భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే.. వేలాది మంది రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు సెక్రటేరియట్ ను ముట్టడించడంతోపాటు ఆమరణ నిరాహార దీక్ష సైతం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రైతులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. గజం భూమిని సైతం కోల్పోనివ్వమని భరోసా అందించారు.