by Suryaa Desk | Sat, Dec 21, 2024, 07:47 PM
నేటి అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ కారణంగానే జరిగిందని, అతడు రాకపోతే తొక్కిసలాట జరిగేది కాదని, రేవతి కుటుంబం నష్టపోయేది కాదంటూ అసెంబ్లీలో మండిపడ్డారు. అంతేకాకుండా సినిమా ముందే ఇద్దరు చనిపోయారని చెప్పినా అల్లు అర్జున్ మూవీ మొత్తం చూసి వెళ్ళాడు.. పోలీసులను అతని దగ్గరకు సినిమా యాజమాన్యం వెళ్లనివ్వలేదు. ఏసీపీ వెళ్లిపోవాలని చెప్పినా అతడు వినలేదని.. అల్లు అర్జున్ నిజ స్వరూపం ఇదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రేవంత్ కు కౌంటర్ గా అల్లు అర్జున్ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రోడ్ షో చేసుకుంటూ.. సంధ్య థియేటర్ లో తొక్కిసలాటకు అల్లు అర్జునే కారణం అని అన్నారు రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదు. కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లారు. దీంతో పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ఒక్కసారిగా పబ్లిక్ సంధ్య థియేటర్ వైపు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోయింది. ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళాడు. సినిమా చూసేందుకు వచ్చి రేవతి చచ్చిపోతే ఆమె కుటుంబాన్ని చూడటానికి కూడా వెళ్లలేదు. అల్లు అర్జున్ కు ఏమైనా అయిందా? కన్ను పోయిందా? కాలు పోయిందా? రూప్ టాప్ మీద ఎక్కి చేతులు ఊపుతూ వెళ్లాడు. అతనివల్లే రేవతి కుటుంబం నష్టపోయింది. ఇకనుంచి బెన్ ఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.