![]() |
![]() |
by Suryaa Desk | Sun, Mar 16, 2025, 11:09 AM
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను హౌజ్ అరెస్ట్ చేశారు. రాజయ్య నివాసం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటుండటంతో పోలీసులు సైతం భారీగా మోహరించారు.కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో రూ. 800 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 50 వేల మందితో శివునిపల్లి వద్ద ప్రజాపాలన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్ శ్రేణులు హాజరుకానున్నారు. సీఎం సభ కోసం జనాన్ని తరలించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండల నేపథ్యంలో సభా ప్రాంగణంలో జర్మన్ టెక్నాలజీ టెంట్లను వేస్తున్నారు. సభకు వచ్చే వారి దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.