|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 03:22 PM
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వరంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, టీ-ఫైబర్‌తో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నిర్ణయంతో సర్కారీ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్య మరింత అందుబాటులోకి రానుంది.రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 26,887 ప్రభుత్వ విద్యా సంస్థలు ఉండగా, వాటిలో కంప్యూటర్లు అందుబాటులో ఉన్న 22,730 పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రక్రియను రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా 10,342 పాఠశాలలకు కనెక్షన్లు ఇస్తారు. ఇందులో 5,342 స్కూళ్లకు బీఎస్ఎన్ఎల్, మిగిలిన 5,000 స్కూళ్లకు టీ-ఫైబర్ ఉచితంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తాయి. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే వెయ్యి పాఠశాలల్లో కనెక్షన్ల ఏర్పాటును పూర్తి చేసింది.రెండో విడతలో మిగిలిన 12,388 పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు. ఇందులో 9,404 పాఠశాలలకు బీఎస్ఎన్ఎల్, 2,984 పాఠశాలలకు టీ-ఫైబర్ కనెక్షన్లు ఇస్తాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా ప్రభుత్వం ఆయా సంస్థలకు చెల్లించనుంది.