|
|
by Suryaa Desk | Fri, Oct 31, 2025, 07:08 PM
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం కేబినెట్ విస్తరణ, పదవుల పంపకం, జూబ్లిహిల్స్ బై పోల్, స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాజగా మరో ప్రకటన చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో మిగిలిన పదవుల భర్తీ ప్రక్రియ డిసెంబర్ నెలలో ప్రారంభం కానుందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు విడతలుగా మంత్రివర్గాన్ని విస్తరించింది. ఇప్పుడు తుది విస్తరణకు రంగం సిద్ధమవుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి.. మంత్రి పదవుల భర్తీ ఒక వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో సహా మొత్తం 12 మంది మంత్రులతో మొదటి విడత ప్రమాణ స్వీకారం జరిగింది. ఇది ప్రధానంగా సామాజిక వర్గాలకు, ప్రాంతీయ ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించడంపై దృష్టి సారించింది.
కొంత కాలం తర్వాత.. ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడానికి రెండవ విడత విస్తరణ జరిగింది.. ఇక్కడ ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. దీంతో తెలంగాణ కేబినెట్ సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఇక తాజాగా నేడు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ సంఖ్య 16కు చేరింది. గరిష్టంగా తెలంగాణ కేబినెట్ సభ్యులు 18 ఉంటారు. డిసెంబర్‌లో మిగిలిన రెండు స్థానాలను భర్తీ చేయనున్నారు. ఈ విస్తరణ పార్టీలో అసంతృప్తిని తగ్గించడానికి.. రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా కీలకమైనదిగా పరిగణిస్తున్నారు.
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ మంత్రి పదవి దక్కించుకోవడం తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ నియామకం జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమయంలో జరగడం రాజకీయ కోణంలో చాలా ముఖ్యమైనది. ఈ నియామకం మైనార్టీ వర్గానికి ప్రాధాన్యం కల్పించడంతో పాటు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ముస్లిం ఓట్లను ఏకీకృతం చేయడానికి ఒక వ్యూహాత్మక అడుగుగా పరిగణించబడింది.
తెలంగాణ మంత్రి వర్గంలో స్థానం కోసం ఎదురుచూసిన ఇద్దరు ఎమ్మెల్యేలకు క్యాబినెట్ స్థాయి పదవులు దక్కాయి. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ.. ఆయనను క్యాబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నియామకాలపై అధికారిక ఉత్తర్వులు జారీ కాగా.. సుదర్శన్‌రెడ్డికి మంత్రుల తరహా సదుపాయాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు దక్కినట్లైంది.