by Suryaa Desk | Thu, Jan 02, 2025, 03:19 PM
హాస్య నటుడు ఏవీఎస్ గురించి తెలియనివారు ఉండరు. తనదైన మేనరిజంతో నవ్వులు కురిపించినవారు ఆయన. అలాంటి ఆయన ఆ మధ్య అనారోగ్య కారణాలతో చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన కూతురు శాంతి గురించి తెలిసినవారు చాలా తక్కువ. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. "మా నాన్నగారికి నేనంటే ఎంతో ప్రేమ. నన్ను 'అమ్మా' అనే పిలిచేవారు. చిన్నప్పటి నుంచి ఏ విషయంలోను ఆయన నాకు ఎలాంటి లోటూ రానీయలేదు. ఏదైనా విషయం బాధ కలిగిస్తే ఒంటరిగా బాధపడేవారేమో తెలియదు. కానీ మా ముందు మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవారు .. నవ్విస్తూనే ఉండేవారు. ఓదార్చడంలో .. ధైర్యం చెప్పడంలో ముందుడేవారు. ఆయన నచ్చజెప్పే విధానం ఎంతటివారినైనా కూల్ చేస్తుంది" అని అన్నారు. "నేను చైల్డ్ ఆర్టిస్టుగా చేశాను. అయితే ఆ తరువాత క్లాసికల్ డాన్స్ .. చదువుపై ఎక్కువగా ఫోకస్ పెట్టాను. కాలేజ్ ఏజ్ కి వచ్చిన తరువాత నాకు కూడా సినిమాలలో నటించాలని అనిపించింది. కానీ అలా చేయడం నాన్నకు నచ్చదేమోనని నేను అడగలేదు. నాకు ఇష్టం లేదనుకుని నాన్న కూడా మౌనంగా ఉండిపోయారు. 'నిన్ను బాపుగారి సినిమాల్లో .. విశ్వనాథ్ గారి సినిమాలలో చూడాలని ఉండేదమ్మా' అని చివరి రోజులలో అన్నారు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నటించాలనుకున్నప్పుడు, నా మనసులోని మాటను నేను నాన్నను అడిగేస్తే పోయేదని అనిపించింది" అని చెప్పారు.
Latest News