by Suryaa Desk | Thu, Jan 02, 2025, 03:22 PM
కర్ణాటక హైకోర్టులో తెలుగు సినీ నటి హేమకు ఊరట లభించింది. గత ఏడాది మే నెలలో బెంగళూరు ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నదని, ఆమె డ్రగ్స్ తీసుకుందని ఆమెపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె రిమాండ్ కు కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో, ఈ కేసులో తదుపరి చర్యలపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. రేవ్ పార్టీలో హేమ ఎండీఎంఏ తీసుకున్నారని నిరూపించే ఆధారాలు లేవని జస్టిస్ హేమంత్ చందన గౌడర్ అన్నారు. సహనిందితుల ఒప్పుకోలు ప్రకటన ఆధారంగానే పిటిషనర్ పై ఛార్జ్ షీట్ వేశారని చెప్పారు. 8వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి, బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు పెండింగ్ లో ఉన్న ఛార్జ్ షీట్, తదుపరి విచారణపై స్టే కోరుతూ హేమ ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ ను దాఖలు చేసింది. దీన్ని విచారించిన ఉన్నత న్యాయస్థానం ఆమెపై తదుపరి చర్యలపై స్టే విధించింది. ప్రస్తుతం హేమ బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే.
Latest News