by Suryaa Desk | Sun, Nov 03, 2024, 12:19 PM
ఆగంతకుల బాంబు బెదిరింపు కాల్స్ ఆగడం లేదు. తాజాగా ఆదివారం ఉదయం గోవా నుంచి కలకత్తా వెళ్తున్న ఇండిగో విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లైట్‌లో బాంబు ఉందని కాల్ చేశారు.దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని శంషాబాద్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆ విమానంలో దాదాపు 180 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఎయిరిండియా ఫ్లైట్, హైదరాబాద్ నుంచి పూణే వెళ్తున్న ఇండిగో విమానానికి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.కాగా, ఎయిర్‌పోర్టు లు, ఫ్లైట్స్ కు బాంబు బెదిరింపు కాల్స్ రావడం పట్ల కేంద్రం చాలా సీరియస్‌గా ఉందని ఇటీవలే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మెహన్ నాయుడు స్టేట్‌మెంట్ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం జరుగుతోందని, బాంబు బెదిరింపుల వెనుక ఎవరు ఉన్నారో విచారణలో తేలుతుందని అన్నారు. ఇక నుంచి ఏవియేషన్ చట్టాల్లో కీలక సవరణలు చేస్తామని పేర్కొన్నారు. ఫేర్ కాల్స్ చేస్తున్న నిందితులు ఎంతటి వారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని.. వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. బాంబు బెదిరింపులకు పాల్పడిన వారికి విమానాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.