by Suryaa Desk | Sun, Nov 03, 2024, 07:04 PM
రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త వినిపించింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి.. సన్న బియ్యం ఇవ్వనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తామని ఇచ్చిన హామీ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్త సంవత్సరంలో.. సంక్రాంతి పండగ తర్వాత రేషన్ కార్డులు ఉన్న వాళ్లందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే.. మొన్నటివరకు జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామంటూ చెప్పుకొచ్చిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు సక్రాంతి తర్వాత ఇస్తామని స్పష్టమైన ప్రకటన చేయటంతో.. పేదల్లో సంతోషం నెలకొంది.
అయితే.. సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శుంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఈ వానాకాలం 150 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని.. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికమని పేర్కొన్నారు. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే.. సన్నబియ్యం పంపిణీపై క్లారిటీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30.50 లక్షల రేషన్ కార్డు దారులకు ఉచితంగా ఆరు కిలోల సన్నబియ్యాన్ని అందించనున్నట్టు తెలిపారు. ఈ సన్న బియ్యాన్ని జనవరి 2025 నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేయనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు.. ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10 లక్షల రూపాయలు ఉచిత వైద్యం అందిస్తున్నామని.. రూ.18 వేల కోట్లతో రైతులకు రుణ మాఫీ చేశామని చెప్పుకొచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. అన్ని సౌకర్యాలతో అధునాతన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను కూడా నిర్మించబోతున్నామని చెప్పుకొచ్చారు. దేశంలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఇంట్రిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేసినట్టు మంత్రి చెప్పుకొచ్చారు. సర్వే నెంబర్ 57లో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను రూ.200 కోట్లతో నిర్మించుకుంటున్నట్టు వివరించారు. ఈ స్కూల్‌లో 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు క్లాసులు జరుగుతాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. వచ్చే నెలలో అంటే డిసెంబర్‌లో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ.. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే ప్రకటించటం గమనార్హం. మరి ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో.. ఇది పూర్తయ్యాకే సన్నబియ్యం పంపిణీ చేస్తారో.. లేదా ఇప్పటికే ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీ చేస్తారన్నది వేచి చూడాల్సిందే.