by Suryaa Desk | Mon, Dec 23, 2024, 07:13 PM
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఈ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన తర్వాత.. నటుడు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టడం తర్వాత పరిణామాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై తాజాగా, సీపీఐ నేత నారాయణ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం పుష్ప-2 సినిమా బెన్‌ఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం సరైంది కాదని అన్నారు. పుష్ప-2 సమాజానికి ఉపయోగపడే సినిమా కాదని, స్మగ్లింగ్, ఎర్రచందనం అక్రమ రవాణా వంటి వ్యవస్థలను ప్రోత్సహించే విధంగా ఉందని ఆయన ఆరోపించారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ ఘటనలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందడం బాధాకరమని, ఆమె కుమారుడు శ్రీతేజ్ చావుబతుకుల మధ్య ప్రాణాలతో పోరాడుతున్నారని నారాయణ చెప్పారు.