by Suryaa Desk | Tue, Dec 24, 2024, 07:54 PM
హైదరాబాద్‌లో హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి తగ్గిందనే వాదనను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కొట్టి పారేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈటీవీ-తెలంగాణ ఏర్పాటు చేసిన ఫోన్-ఇన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా హైడ్రా కారణంగా హైదరాబాద్‌లో రియాల్టీ పడిపోయిందని అంటున్నారు కదా? అని ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చారు.అసలు దక్షిణాది రియల్ ఎస్టేట్ రంగంలోనే డౌన్ ట్రెండ్ కనిపిస్తోందన్నారు. గణాంకాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుందన్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం వంటి పట్టణాల్లో కూడా రియాల్టీ తగ్గిందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. అక్కడ హైడ్రా లేదు కదా అన్నారు. హైడ్రాకు, రియాల్టీ తగ్గడానికి సంబంధం లేదన్నారు.హైడ్రా కేవలం చెరువులు తదితర వాటిని ఆక్రమించుకుని నిర్మించిన వాటినే కూల్చుతోందన్నారు. అదీ హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లడం లేదన్నారు. ప్రతి దానిని హైడ్రా ఖాతాలోకి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రియాల్టీ తగ్గడానికి హైడ్రానే కారణమైతే ఇతర ప్రాంతాల్లో కూడా ఎందుకు తగ్గిందో చెప్పాలన్నారు.