by Suryaa Desk | Tue, Dec 24, 2024, 06:39 PM
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు తెలంగాణ హైకోర్టులోఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు కేసులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేస్తూ తీర్పును వెలువరించింది. భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరిగా లేవంటూ వాటిని సస్పెండ్ చేశారు. అదే సమయంలో ఫిర్యాదుదారుడు నాగవెల్లి లింగమూర్తికి నోటీసులు జారీ చేసింది.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుకు అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు కారణమంటూ లింగమూర్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ స్వీకరించిన జిల్లా సెషన్స్ కోర్టు కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు పంపింది. దీంతో వారు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా కోర్టులో దాఖలైన ప్రైవేటు కేసును కొట్టేయాలని కోరారు. ఈ మేరకు నేడు విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి.. ఆ నోటీసులను సస్పెండ్ చేసింది. కేసులో తదుపరి విచారణను ధర్మాసనం జనవరి 7కు వాయిదా వేసింది.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ కుంగుబాటుపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారులు జోషి, రజత్ కుమార్‌ను విచారించిన ఘోష్ కమిషన్.. ఇటీవల ఐఏఎస్ స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌ను సైతం విచారించింది. ఈ క్రమంలో స్మితాను కమిషన్ ప్రశ్నించగా.. కొన్ని విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కేబినెట్, సీఎంవోకి ఏ ఫైల్ రాలేదని స్మితా సబర్వాల్ వెల్లడించినట్లు సమాచారం. సీఎం సెక్రటరీగా జనరల్ కో ఆర్డినేషన్‌కే తన పని పరిమితమని చెప్పినట్లు తెలిసింది. కమిషన్ అడిగిన చాలా ప్రశ్నలకు స్మితా తెలియదనే సమాధానాన్నే విచారణలో వెల్లడించినట్లు తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ సైతం కమిషన్‌కు తెలిపినట్లు తెలిసింది. ప్రాజెక్ట్ అప్రూవల్స్ సమయంలో తాను సీఎస్ లేదా ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేయలేదని ఆయన వెల్లడించారు. ఇరిగేషన్ సెక్రటరీగా తాను మూడు నెలలు మాత్రమే పనిచేసినట్లు చెప్పిన సోమేష్ కుమార్.. ఆ సమయంలో ప్రాజెక్ట్ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని వెల్లడించారు.