by Suryaa Desk | Mon, Dec 23, 2024, 08:14 PM
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై నటుడు అల్లు అర్జున్‌పై కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో పోలీసులు వివరంగా చెప్పారని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బాధ్యతారాహిత్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చాలా స్పష్టంగా విజువల్స్‌తో సహా వివరించారని గుర్తు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... సినిమా పరిశ్రమ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు.అల్లు అర్జున్ ఆ రోజు జైలు నుంచి బయటకు వచ్చాక చట్టానికి కట్టుబడి ఉంటానని బాధ్యతాయుతమైన పౌరుడిగా మాట్లాడారని తెలిపారు. ఈ ఘటనలో ఎవరినీ బాధ్యులుగా చేయడం లేదన్నారు. మజ్లిస్ పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సభలో వివరణ ఇచ్చారని తెలిపారు. సీఎం వాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారన్నారు. థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ రాక సందర్భంగా అనుమతి కోసం దరఖాస్తు చేసింది నిజమేనని... కానీ పోలీసులు అనుమతి ఇచ్చారని చెప్పడం అవాస్తవమన్నారు.సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన రోజే అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారని గుర్తు చేశారు. రేవతి చనిపోయారని, ఆమె తనయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరిగితే భవిష్యత్తులో బెనిఫిట్ షోలకు అనుమతులు, ఇతర రాయితీలు ఉండవని సీఎం స్పష్టంగా చెప్పారన్నారు. సామాన్యులకు ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చినప్పుడు కఠిన నిర్ణయాలు తప్పవన్నారు.సీఎం మాట్లాడిన రోజు అల్లు అర్జున్ మాట్లాడిన తీరును ఎంపీ తప్పుపట్టారు. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే అతను చదివారని విమర్శించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని అల్లు అర్జున్ చెప్పి ఉంటే రీల్ స్టార్ నుంచి రియల్ స్టార్‌గా ఎదిగేవారన్నారు.అందరూ బాగుండాలని కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు. సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిందో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారన్నారు. సినిమా పరిశ్రమపై అవగాహన లేని వ్యక్తికి టీఎఫ్‌డీసీ చైర్మన్ పదవి అప్పగిస్తే సమస్యలు పరిష్కారం కావేమోనని భావించి పరిశ్రమకు చెందిన వ్యక్తికి ఇచ్చామన్నారు. దిల్ రాజు అంటే ఈరోజు పరిశ్రమలో బ్రాండ్ అని పేర్కొన్నారు. అంజయ్య ప్రభుత్వంలో సినిమా పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకువచ్చే క్రమంలో ఫిల్మ్ నగర్‌లో స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. పద్మాలయ, రామానాయుడు స్టూడియోస్‌కు కూడా నాటి ప్రభుత్వం స్థలాన్ని ఇచ్చిందన్నారు. నిర్మాత, నటుడి నుంచి మొదలు కిందిస్థాయి కార్మికుడి వరకు బాగుండాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందన్నారు.