by Suryaa Desk | Tue, Dec 24, 2024, 06:31 PM
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలు కాగా.. ప్రస్తుతం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో ఏ 11 నిందితుడిగా అల్లు అర్జున్‌ను అరెస్టు చేయటం, ఆయన బెయిల్‌పై విడుదైలన సంగతి కూడా తెలిసిందే. అయితే అల్లు అర్జున్ వ్యవహారం సినిమా వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా తయారైంది. పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్‌పై కేసును సమర్థిస్తుండగా.. ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు హీరోపై కేసులు పెట్టారని మండిపడుతున్నారు.
తాజాగా.. సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. అల్లు అర్జున్ కేసు చాలా చిన్నదని అభిప్రాయపడ్డారు. థియేటర్ వద్ద భద్రతా వైఫల్యం ఉన్న విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయిందని చెప్పారు. ఆ విషయాన్ని పక్కనపెట్టి హీరోను మాత్రమే ప్రభుత్వం కారణంగా చూపుతోందని వ్యాఖ్యనించారు. ఒక తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక తప్పులు చేస్తోందని ఆయన ఆరోపించారు.
రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత.. అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టడాన్ని కొందరు తప్పుపడుతున్నారని.. ఆయన ప్రెస్‌మీట్ పెట్టడానికి వీలు లేనప్పుడు హైదరాబాద్ సీపీ వీడియోలు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం కక్షగట్టినట్లు ప్రవర్తించడం సరికాదని రఘునంద్ హితవు పలికారు. రేవతి మరణం విచారకరమని.. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఆమె మృతి చెందినట్లు చెప్పారు. చిన్నారి శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ముగిసిన అల్లు అర్జున్ విచారణ ఇక ఈ కేసులో అల్లు అర్జున్ నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు స్టేషన్‌కు చేరుకోగా.. దాదాపు 2 గంటల పాటు ఆయన్ను విచారించారు. సిటీ సెంట్రలో జోన్ డీసీపీతో పాటు చిక్కడపల్లి ఏసీపీ, సీఐ ఆయన్ను విచారించారు. దాదాపు 50 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. వీటిల్లో చాలా ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడని సమాచారం. న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో అల్లు అర్జున్ స్టేషన్ నుంచి ఇంటికి చేరుకోనున్నారు.