by Suryaa Desk | Sat, Nov 02, 2024, 07:38 PM
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా కాంగ్రెపై ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ సహా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హామీలు అమలు కావటం లేదని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ బలహీన పడుతుందని.. దోపిడి పెరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ అసత్యాలు, నెరవేర్చనవిగా పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజలను తీవ్రంగా మోసం చెయ్యటమే అని దుయ్యబట్టారు.
తాజాగా.. మోదీ వ్యాఖ్యలను తెలంగాణ సీఎం రేవంత్ తీవ్రంగా ఖండించారు. తాము నెరవేర్చిన హామీలు ఇదిగో అంటూ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ చేసిన ప్రకటనలో అనేక అవాస్తవాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రజల జీవితాలలో వెలుగులు వచ్చాయని చెప్పారు. టీజీఎస్ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ వంటి హామీలను నెరవేర్చాం. గత 11 నెలల్లో రూ.101 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు చేపట్టి.. ఒక ఏడాది లోపు మహిళలు రూ.3,433.36 కోట్లు ఆదా చేశారు. 22 లక్షల 22 వేల మంది రైతులకు రుణమాఫీ చేసాం. 25 రోజుల్లో 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం. పేదల ఇండ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉంటే, కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో కేవలం రూ. 500 రూపాయలకే సిలిండర్ లభిస్తుంది. 1.31 కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్ రీఫిల్ లబ్ధి జరిగింది. 42,90,246 మంది పథకం ద్వారా లబ్ధిపొందారు. గ్రూప్ - 1, 2, 3, 4 ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన11 నెలల్లోపే భర్తీ చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 మంది అర్హతగల యువతకు ఉద్యోగాలు కల్పించింది. ఇది ఏ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. సంక్షేమ హాస్టళ్ల డైట్ చార్జీలు 40 శాతానికి పైగా పెంచాం. గతంలో నిర్లక్ష్యానికి గురైన మూసీ నదిని శుభ్రం చేసి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
ఫ్యూచర్ సిటీ సిద్ధం అవుతుంది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ ,ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. మేము ప్రజలకు చేసే ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే పనిలో నిమగ్నమయ్యాం. తెలంగాణలో చీకటిని పాలద్రోలి సూర్యుడిలా వెలుగును నింపంతున్నాం.' అని సీఎం రేవంత్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.