by Suryaa Desk | Sun, Nov 03, 2024, 07:40 PM
హైదరాబాద్ బాపూఘాట్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మూసీ నది ఒడ్డున ఈ విగ్రహం ఏర్పాటుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా.. బాపూఘాట్‌ను ప్రధాన పర్యాటక ఆకర్షణగా, ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. ఘాట్ వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు. మొదటి దశ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ నుంచి ఎగువన ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వరకు 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. బాపూఘాట్‌లో గాంధీ భావజాల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా, హైదరాబాద్ బాపూఘాట్‌లో ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. త్వరలో హైదరాబాద్‌లో ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్లు కొన్ని వార్త పత్రికలు ప్రచురించగా.. ఆ వార్తలపై ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. విగ్రహాల ఏర్పాటు పోటీకి తాను పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. దయచేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని మెరుగుపరిచేందుకు వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డిని తుషార్ గాంధీ విజ్ఞప్తి చేశారు.
కాగా, విగ్రహం ఏర్పాటు దిశగా రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. విగ్రహం డిజైన్‌లు, ఎత్తుపై నిపుణులు, డిజైనర్లతో సంప్రదింపులు ప్రారంభించింది. విగ్రహం ఎత్తు, ఇతర అంశాలపై రాజకీయ పార్టీల నుంచి సలహాలను కూడా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. విగ్రహం భంగిమ కూర్చోవడం, నడవడం, కవాతు లేదా మరేదైనా డిజైన్‌పై అందరి అభిప్రాయాలు తీసుకునేందుకు రెడీ అయింది. నిపుణులు, రాజకీయ పార్టీలు, మేధావుల నిర్ణయం మేరకు విగ్రహం డిజైన్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న గాంధీ విగ్రహాలు చూస్తే.. పాట్నాలోని గాంధీ మైదాన్‌లోని గాంధీ విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తైనది. 2013లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఎత్తు 72 అడుగులు. ఇండియా వెలువల చూస్తే.. అమెరికా టెక్సాస్‌లో 8 అడుగుల ఎత్తైన గాంధీ విగ్రహం ఉంది. ఇక తెలంగాణలో అయితే రాష్ట్ర శాసనసభ ఆవరణలో 22 అడుగుల ఎత్తైన గాంధీ విగ్రహం ఉంది. 1999లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం, ఇది 182 అడుగుల ఎత్తులో ఉంది. ఈ విగ్రహం కంటే ఎత్తులో గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించటం తెలిసిందే.