by Suryaa Desk | Mon, Nov 04, 2024, 08:58 PM
ప్రభుత్వ ఆదాయం పెంపుపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలపై భారం పడకుండానే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సమావేశమైంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాయింట్ వెంచర్లలో వివాదాలను పరిష్కరించి ఆదాయం పెంచాలని సూచించారు. ఇందుకోసం ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.తమకు ప్రోత్సాహకాలు అందిస్తే నగరం విడిచి ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు వెళతామని వివిధ పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారని, అదే జరిగితే నగరంలో కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు. కాబట్టి వారి విజ్ఞప్తులను పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు బయట పరిశ్రమలను స్థాపించుకునేలా ప్రోత్సాహకాలు ఉండాలన్నారు