by Suryaa Desk | Mon, Nov 04, 2024, 03:01 PM
జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప లో ఉన్న పార్కులను నేడు సిపిఐ బృందం ఆద్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సభ్యులు ఏసురత్నం, నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ లు మాట్లాడుతూ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సిపిఐ ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం పోరాటం చేసి గుడిసెలు వేయించామని, సిపిఐ నాయకత్వాన్ని పిలిచి ప్రభుత్వమే ప్రజలకు ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆయా ప్రాంతాలో వేలాది రాజీవ్ గృహ కల్ప ఇళ్లను కట్టించి ప్రజలకు ఇచ్చారని, ప్రజల కోసం పార్కులను కూడా ఏర్పాటు చేసారని అన్నారు.
పార్కులను మరింత అభివృద్ధి చేయాల్సిందిగా గత ప్రజావానిలో సిపిఐ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చామని అన్నారు. నాడు పెద్దలు ఉదయం సాయంత్రం వ్యాయామం చేసుకోవడానికి, చిన్న పిల్లలు ఆడు కోవడానికి ఏర్పాటు చేసిన పార్కులు నేడు అభివృద్ధికి నోచుకోకుండా, వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయని అన్నారు. రాత్రి సమయంలో మందుబాబులకు, ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయని, కావున డిప్యూటీ కమిషనర్ వెంటనే పరిశీలించి పార్కును అభివృద్ధి చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహయ కార్యదర్శి దుర్గయ్య కార్యవర్గ సభ్యులు సదానంద్, సహదేవరెడ్డి, ప్రజానాట్యమండలి బాబు, స్థానిక నాయకులు సాయి రెడ్డి, డేనియల్, ఇమామ్, వంశీ,మహేష్ లు పాల్గొన్నారు.