by Suryaa Desk | Mon, Nov 04, 2024, 02:04 PM
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్షలను ఏడాదికి 2 సార్లు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం..మాట నిలబెట్టుకుంది. ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకూ టెట్ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా టెట్ పరీక్షలకు రెండో నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరిలో పరీక్షలు నిర్వహించనుండగా.. లక్షలాది మంది ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకూ ఆన్లైన్లో టెట్ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు నవంబర్ 5 నుంచి 20వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలి.
ఈ ఏడాది నిర్వహించిన టెట్ పరీక్షలకు 2.35 లక్షల మంది హాజరవ్వగా.. 1.09 లక్షల మంది పాసయ్యారు. కాగా.. స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత ఉండాలని చెబుతుండటంతో.. వేలాది మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పరీక్షలు రాయనున్నారు. టెట్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 9 సార్లు పరీక్షలు నిర్వహించగా.. వచ్చే ఏడాది జనవరిలో 10వ సారి టెట్ పరీక్షలు జరుగనున్నాయి.