by Suryaa Desk | Sun, Nov 03, 2024, 09:42 PM
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిశాయి. గత నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన మూడు అల్పపీడనాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే గత 10 రోజులుగా తెలంగాణలో వర్షాలు లేవు. రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొని ఉంది. ఉదయం, రాత్రి వేళల్లో విపరీతమైన చలి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తుండగా.. మధ్యాహ్నం సమయంలో ఎండ కాస్తుంది. ఈ నేపథ్యంలో నేటి వాతావరణంపై హైదరాబాద్ వాతారవణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు.
ప్రస్తుతం తమిళనాడు దక్షిణ తీరంలో బంగాఖాఖాతంలో ఆవర్తనం ఉందని చెప్పారు. అది శ్రీలంకను ఆనుకొని ఉందన్నారు. దాని ప్రభావంతో తమిళనాడు, కర్ణాటకకు భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీ, తెలంగాణలో మాత్రం తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు. తెలంగాణలో నేడు తేలికపాటి మేఘాలు.. వస్తూ పోతూ ఉంటాయన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం మాత్రం లేదన్నారు. దక్షిణ రాయలసీమ, ఉత్తర తెలంగాణలో ఒకట్రెండు చోట్ల మాత్రం జల్లులు కురుస్తాయని చెప్పారు.
ఇక తెలంగాణలో గాలి వేగం మరింత పెరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్లుగా గాలి వేగం ఉందన్నారు. తెలంగాణ ఉష్ణోగ్రత విషయానికొస్తే.. మాగ్జిమం 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుందన్నారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్ వంటి జిల్లాల్లో 33 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొంత వేడి వాతావరణం ఉంటుందని చెప్పారు. అయితే రాత్రిళ్లు మాత్రం చలి తీవ్రత మరింత పెరుగుతుందన్నారు. అందువల్ల చలి బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ఇక గత వందేళ్లలో అధిక ఉష్ణోగ్రతలు ఈ ఏడాది అక్టోబర్‌లో నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. 1901 నుంచి అక్టోబర్‌లో నమోదైన సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఈ ఏడాది 1.23 డిగ్రీల మేర పెరిగినట్లు చెప్పింది. ఈ నెలలో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా కొనసాగుతాయని అంచనా వేస్తోంది. సాధారణ శీతాకాలం ప్రభావం కనిపించదని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వెస్ట్రన్ డిస్ట్రబెన్సెస్ బలహీనపడటం, పసిఫిక్ మహాసముద్రంలో లానినా అభివృద్ధి కాకపోవడం, బంగాళాఖాతంలో తుపాన్లు, వాయుగుండాల ఏర్పాటుతో గాలుల ప్రవాహం నిలిచిపోవటం ఇందుకు కారణంగా ఐఎండీ వెల్లడించింది.