by Suryaa Desk | Sun, Nov 03, 2024, 09:40 PM
తెలంగాణలోని యూనివర్సిటీలను నూటికి నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉన్నత విద్యకు సంబంధించి గడిచిన పదేండ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాలని ఉన్నత విద్యా మండలికి, వైస్ చాన్సలర్లకు సూచించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉన్నత విద్యా మండలి చైర్మన్‌తో పాటు అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు శనివారం సీఎం రేవంత్‌ను జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యామండలి, వీసీలకు సీఎం దిశానిర్దేశం చేశారు.
'ఎవరి ప్రభావితంతోనో వైఎస్ చాన్సలర్ పోస్టులకు ఎంపిక జరగలేదు. మెరిట్, సామాజిక సమీకరణల ఆధారంగానే ఎంపిక జరిగింది. బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి. కొంతకాలంగా యూనివర్సిటీల పట్ల విశ్వాసం సన్నగిల్లింది. తిరిగి వర్సిటీల గౌరవం పెంచే దిశగా పని చేయాలి. యూనివర్సిటీలను 100 శాతం ప్రక్షాళన చేయాలి. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను విద్యార్థులు యేళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి ప్రమాణాలను పెంచే చర్యలు మొదలు పెట్టాలి. అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేసుకోవాలి. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలి. మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్లకి స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వ సహకారం ఉంటుంది. తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సివస్తుంది. యూనివర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపైన దృష్టి సారించాలి. అలాంటి విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలి.' అని సీఎం రేవంత్ సూచించారు.
ఒకప్పుడు ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూ.. ఇలా వర్సిటీ ప్రాంగణంలో చదివామని గర్వంగా చెప్పుకొనేవారని.. ఇప్పుడా పరిస్థితి లేదని సీఎం రేవంత్ అన్నారు. వర్సిటీల ప్రతిష్ఠను మళ్లీ ఇనుమడింపజేయాలని, అది వీసీల చేతుల్లోనే ఉందని తెలిపారు. విద్యా నాణ్యత విషయంలో రాజీపడవద్దని సీఎం స్పష్టం చేశారు. వర్సిటీల అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. రెండు మూడు నెలల తర్వాత ఇద్దరు లేదా ముగ్గురి చొప్పున ఆహ్వానిస్తానని, దీనిపై విపులంగా చర్చిద్దామని సీఎం వీసీలకు స్పష్టం చేశారు. ఈ భేటీలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. బాలకృష్ణా రెడ్డి, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆయా వర్సిటీలకు కొత్తగా నియమితులైన 11 మంది వైస్ చాన్సలర్లు పాల్గొన్నారు.